6 నెలల్లో భారత్‌లో పీవోకే విలీనం ఖాయం : యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

 


కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి గెలిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను (పీవోకే) భారత్‌లో తిరిగి విలీనం చేస్తుందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల సీజన్, ఆ పార్టీ నేతల ప్రసంగాలు కూడా పలుమార్లు పీవోకే చుట్టూ తిరిగాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పాల్ఘర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. 

గడిచిన దశాబ్ధ కాలంలో నవభారత నిర్మాణాన్ని చూశామని.. ఉగ్రవాదాన్ని అరికట్టి, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశామని సీఎం గుర్తుచేశారు. ప్రధానిగా మోడీ మరోసారి గెలిస్తే కేవలం ఆరు నెలల్లోనే పీవోకే భారత్‌లో విలీనమవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకేను ఆక్రమించుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోందని.. కానీ అది జరగదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 

ఇక పాకిస్తాన్‌లో అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో హత్యకు గురవుతున్న ఉగ్రవాదులపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో గత మూడేళ్లుగా పలువురు ఉగ్రవాదులు చనిపోయారని.. దీని వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయని యోగి పేర్కొన్నారు. అయితే మన ప్రజలను పొట్టనబెట్టుకున్న వారిని పూజించలేం కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 



Comments